PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 2:08 pm Posted by : PRABHATHA SURYUDU

రాజధానిలో వేగంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలు.. నాంపల్లిలో రేపే శంకుస్థాపన

హైదరాబాద్‌లో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. నగరంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఇందిరమ్మ టవర్స్’ పనులు ఊపందుకుంటున్నాయి. తొలి దశలో 16 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. తాజాగా నాంపల్లి నియోజకవర్గంలో నిర్మాణాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కేపీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గం మల్కం చెరువు వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నాంపల్లి నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌కు మంగళవారం (సెప్టెంబర్ 29న) రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రెడ్‌హిల్స్‌లోని జలమండలి కార్యాలయం పక్కన 360 ఇళ్లు, నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో మరో 120 ఇళ్లను నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలోనే లబ్ధిదారులకు పబ్లిక్ లాటరీ ద్వారా ఏ బ్లాక్‌లో ఏ ఫ్లాట్ రానుందో నంబర్ల వారీగా కేటాయించి, అక్కడికక్కడే వారికి పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ హౌసింగ్ బోర్డు పారదర్శకంగా లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపికను చేపడుతోంది.

ఎకరం వందల కోట్లు పలికే ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారికి పూర్తి భరోసా కల్పిస్తోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. లబ్ధిదారులకు 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్ షేర్‌తో పాటు అపార్ట్‌మెంట్‌పై పూర్తి హక్కులు కల్పిస్తామని, ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా ఉచితంగా సేల్ డీడ్ చేసి ఇస్తామని వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి, పైరవీలకు ఎలాంటి తావులేదని.. ఒత్తిళ్లకు లొంగకుండా కేవలం అర్హత ఆధారంగానే ఎంపిక జరుగుతోందని తెలిపారు.

ఇక నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. తమ ఇళ్లు ఎలా నిర్మిస్తున్నారో లబ్ధిదారులు వారానికోసారి స్వయంగా వెళ్లి పనులను పర్యవేక్షించుకోవచ్చని, ఏమాత్రం నాణ్యతా లోపం కనిపించినా అక్కడి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి సూచించారు. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 480 చొప్పున చేపడుతున్న ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తవడంతో త్వరలోనే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.