PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:44 pm Posted by : PRABHATHA SURYUDU

సహచర పైలట్‌పై కత్తితో దాడి చేసి వికృత చేష్టలు

ప్రాణాలకు తెగించి దాడిని అడ్డుకున్న ప్రయాణికుడు, సిబ్బంది

సౌదీ అరేబియాలో విమానం అత్యవసర ల్యాండింగ్

సంచలన వివరాలు వెల్లడించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన పైలటే వారి ప్రాణాలతో చెలగాటమాడేందుకు యత్నించాడు. విమానాన్ని నడుపుతున్న ఒక పైలట్ సహచర పైలట్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఓ ప్రయాణికుడు, విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు.

నెతన్యాహు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన విమానం ఇజ్రాయెల్ గగనతలానికి సమీపిస్తున్న సమయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధిక శాతం ఇజ్రాయెల్ పౌరులే ఉన్నారు. కాక్‌పిట్‌లో విధుల్లో ఉన్న ఒక పైలట్ అకస్మాత్తుగా తోటి పైలట్‌పై కత్తితో దాడికి దిగాడు. అనంతరం విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేసేందుకు యత్నించినట్లు ప్రాథమిక సమాచారం ఉనట్లు ప్రధాని పేర్కొన్నారు.

అడ్డుకున్న ప్రయాణికుడు..

కాక్‌పిట్‌లో జరుగుతున్న ఈ అనూహ్య పరిణామాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు, మరో క్యాబిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి కాక్‌పిట్‌లోకి ప్రవేశించి, దాడికి పాల్పడిన పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే మరో సిబ్బంది విమాన నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకొని విమానాన్ని సురక్షితంగా నడిపారు. వీరి సాహసోపేతమైన చర్యల వల్లే పెను వినాశనం తప్పిందని, వందలాది ప్రాణాలు నిలబడ్డాయని నెతన్యాహు వారిని ప్రశంసించారు.

సౌదీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఈ దారుణ ఘటన అనంతరం విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలోని టబుక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ దాడిలో ఇద్దరు పైలట్లకు గాయాలైనట్లు సమాచారం. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పైలట్‌ను సౌదీ భద్రతా అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు నెతన్యాహు స్పష్టం చేశారు.