ఏకో టౌన్‌కు వ్యతిరేకంగా గ్రామాల ఐక్య గళం
GO.MS.No.20 రద్దు చేయాలని భారీ పాదయాత్ర, ధర్నా
భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజల డిమాండ్
అబ్దుల్లాపూర్ మెట్ – ప్రభాత సూర్యుడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బండరావిరాల, చిన్నరావిరాల, గువ్వలేటి గ్రామాల పరిధిలో ప్రతిపాదిత ఏకో టౌన్ (డంపింగ్ యార్డ్) ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివారం భారీ స్థాయిలో ప్రజా నిరసన వ్యక్తమైంది. సర్వే నంబర్ 268లో 494 ఎకరాల భూమిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఏకో టౌన్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చిన్నరావిరాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిలాయిపల్లి, గువ్వలేటి, చిన్నరావిరాల, బండరావిరాల, కవాడిపల్లి గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిరసనలో భాగంగా గువ్వలేటి నుంచి సద్దపల్లి చౌరస్తా వరకు వందలాది మంది ప్రజలు పాదయాత్రగా తరలివెళ్లి, అనంతరం సత్తుపల్లి కూడలిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు “Save Chinnaravirala and Guvvaleti & Bandaravirala – Cancel GO.MS.No.20” అంటూ నినాదాలు చేశారు.

నిరసనకారులు మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా మైనింగ్ కార్యకలాపాల కారణంగా కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్న బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల ప్రజలను ఇప్పుడు ఏకో టౌన్ పేరుతో మరోసారి కాలుష్యపు ముప్పులోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పచ్చని పంట పొలాలను డంపింగ్ యార్డ్‌గా మార్చడం వల్ల వ్యవసాయ భూములు నాశనమవడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. డంపింగ్ యార్డ్‌లో నిల్వ చేసే వ్యర్థాల కారణంగా వాయు కాలుష్యం పెరిగి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, భవిష్యత్ తరాల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి, నీటి కాలుష్యం ఒక గ్రామానికే పరిమితం కాకుండా పరిసర ప్రాంతాలన్నింటిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. https://urbanriseopulence.org.in/telangana-eco-town-hyderabad-kitakyushu-green-city-model/
ఏకో టౌన్ ఏర్పాటుతో బండరావిరాల, చిన్నరావిరాల, గువ్వలేటి, కవాడిపల్లి, అబ్దుల్లాపూర్, తారామతిపేట, బాచారం, గౌరెల్లి, సద్దపల్లి, పిలాయిపల్లి, దేశ్ముఖ్, జగత్‌పల్లి, పెద్దగూడెం, జూలూరు, నారాయణగిరి, పిగ్లీపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన GO.MS.No.20ను వెంటనే రద్దు చేసి ఏకో టౌన్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని గ్రామాల పరిమితిలో కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చేందుకు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, రైతులు, యువత, మహిళలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండరావిరాల సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, పిలాయిపల్లి సర్పంచ్ మహలక్ష్మి, కవాడిపల్లి ఉపసర్పంచ్ రాసాల రాము యాదవ్, మాజీ సర్పంచ్ కవాడి శ్రీనివాసరెడ్డి, నాయకులు దంతూరి మహేందర్ గౌడ్, సురకంటి శ్రీనివాసరెడ్డి, కొలన్ రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More: https://prabhathasuryudu.com/hydra-staff-allege-ranganath-comments-over-salaries/