PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 1:32 pm Posted by : PRABHATHA SURYUDU

FASTag Local Pass 2026: 20 కి.మీ పరిధిలో నివాసులకు రాయితీ

టోల్‌ప్లాజాల సమీప నివాసులకు కేంద్రం కొత్త పాస్

20 కి.మీ పరిధిలో నివసించే వారికి రాయితీతో వార్షిక లోకల్ పాస్

టోల్‌ప్లాజా ప్రాంతాన్ని బట్టి రూ.1,500, రూ.3,000 చెల్లింపు

న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు:

జాతీయ రహదారులపై ప్రయాణించే టోల్‌ప్లాజాల సమీప నివాసితులకు కేంద్ర ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన వాహనదారులకు రాయితీతో కూడిన వార్షిక లోకల్ పాస్ అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు 2026 నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ పాస్‌ను పొందేందుకు వాహన యజమాని టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ ఉండాలి. వాహనం వాణిజ్యేతర అవసరాల కోసం రిజిస్టర్ అయి ఉండటంతో పాటు, దానికి చెల్లుబాటు అయ్యే ఫంక్షనల్ FASTag తప్పనిసరిగా ఉండాలి. అర్హులైన వారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెలవారీ పాస్ లేదా కొత్త రాయితీ వార్షిక లోకల్ పాస్‌లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. టోల్‌ప్లాజా మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిధికి వెలుపల ఉంటే వార్షిక పాస్‌కు రూ.1,500 చెల్లించాలి. అదే టోల్‌ప్లాజా మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిధిలో ఉంటే రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాస్‌ను సంబంధిత టోల్‌ప్లాజా వద్ద మాత్రమే వినియోగించుకోవాలి. ఇతర టోల్‌ప్లాజాల వద్ద ఉపయోగించడానికి లేదా మరొక వాహనానికి బదిలీ చేయడానికి అనుమతి ఉండదు.FASTag Local Pass for Toll Plaza Residents

అయితే ఈ రాయితీ అన్ని టోల్‌ప్లాజాలకు వర్తించదు. క్లోజ్డ్ యూజర్ ఫీ కలెక్షన్ విధానంలో టోల్ వసూలు చేసే జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ పాస్ అందుబాటులో ఉండదు. అలాగే ప్రయాణికుల వినియోగానికి సర్వీస్ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో ఉన్న సందర్భాల్లోనూ ఈ రాయితీ పాస్ జారీ చేయరు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 26న నేషనల్ హైవేస్ ఫీ (డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్) ఐదో సవరణ నిబంధనలు–2026ను గెజిట్‌లో ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం నవంబర్ 1 నుంచి అర్హులైన టోల్‌ప్లాజాల వద్ద వార్షిక లోకల్ పాస్ అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 1 నుంచి రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా కూడా ఈ పాస్ పొందే సదుపాయం కల్పించనున్నారు. పాస్ రుసుములను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న సమీక్షించి సవరించే అవకాశం ఉంది. టోల్‌ప్లాజాల సమీపంలో నివసిస్తూ ప్రతిరోజూ రాకపోకలు సాగించే అర్హులైన ప్రైవేటు వాహనదారులకు ఈ కొత్త విధానం ఆర్థికంగా కొంత ఊరటనివ్వనుంది.