PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 6:00 am Posted by : PRABHATHA SURYUDU

అక్రమ నిర్మాణాల జోరు.. అధికారుల పర్యవేక్షణ కరువు..!

  • పెద్ద అంబర్‌పేట్, కుంట్లూరు డివిజన్లలో అనుమతిలేని నిర్మాణాలు
  • నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు
  • టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

నాగోల్ సర్కిల్ – ప్రభాత సూర్యుడు

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, నాగోల్ సర్కిల్‌ పరిధిలోని పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా భారీ షెడ్లు, గోదాములు, బహుళ అంతస్తుల భవనాలు, సెల్లార్ల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో మున్సిపల్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

పెద్ద అంబర్ పేట్ బలిజగుడా రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న మడిగెలు

అక్రమ నిర్మాణాల వెనుక కొందరు తాజా మాజీ ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పాటు అధికారుల సహకారం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఫిర్యాదులు బుట్ట దాకలే తప్ప, చర్యలు మాత్రం శూన్యంగానే మిగిలిపోతున్నాయని, కొన్ని సందర్భాలలో కేవలం నోటీసులు జారీ చేయడం వరకు మాత్రమే పరిమితమవుతున్నారని, తదుపరి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాల కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఫీజులు, అనుమతి రుసుముల రూపంలో కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా కుంట్లూరు చౌరస్తాలో నిర్మించిన వ్యాపార సముదాయాలు(మడిగెలు)

అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం సమర్థవంతంగా పనిచేయడం లేదని, కొందరు అధికారులు అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపి పట్టణ ప్రణాళిక నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కుంట్లూరు కూడలిలోని శాంక్టస్ వరల్డ్ స్కూల్ ఆవరణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భారీ షెడ్