చర్యలు లేకపోవడంతో అధికారుల తీరుపై అనుమానాలు
ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోరా? అంటూ స్థానికుల ప్రశ్నలు
పెద్ద అంబర్‌పేట్ – ప్రభాత సూర్యుడు
నాగోల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పెద్ద అంబర్‌పేట్ డివిజన్‌లో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, పెద్ద అంబర్పేట్ లోని నాగోల్ సర్కిల్ కార్యాలయానికి అతి చేరువలో కళ్లెం బాల్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణంలో భారీ ఎత్తున షెడ్డు నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించడం లేదని చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలపై నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం ఎందుకు మౌనం పాటిస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సాధారణ ప్రజలు చిన్నపాటి నిర్మాణ మార్పులు చేసినా వెంటనే చర్యలు తీసుకునే అధికారులు, పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణాల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ నిర్మాణాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ, సంబంధిత శాఖలు స్పందించకపోవడం గమనార్హమని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. నిబంధనల అమలులో అందరికీ ఒకే విధానం ఉండాలే గానీ, కొందరికి ఒక విధానం, మరికొందరికి మరో విధానం ఉండకూడదని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ నిర్వహించి, అవసరమైతే నిర్మాణ అనుమతులు, పన్ను రికార్డులు, అసెస్‌మెంట్ వివరాలను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని ఉన్నతాధికారుల కోరుతున్నారు.
“అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో అధికారుల జాప్యం వెనుక అసలు కారణం ఏమిటి?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద అంబర్‌పేట్ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.