PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 6:42 pm Posted by : PRABHATHA SURYUDU

Moharram : నెమలి కాల్వలో ఘనంగా పీర్ల పండుగ ఉత్సవాలు

నెమలి కాల్వలో ఘనంగా పీర్ల పండుగ ఉత్సవాలు

– 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహణ
– దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గ్రామస్తులు

వలిగొండ – ప్రభాత సూర్యుడు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నెమలి కాల్వ గ్రామంలో పీర్ల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది 11 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. ఉత్సవాలు మొదటి రోజు సందుల (పెట్టెల దింపే) కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. అనంతరం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పదో రోజు రాత్రి సంప్రదాయబద్ధంగా మట్కీల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు మొహర్రం సందర్భంగా సవారీలను ఊరూర వీధుల్లో ఘనంగా ఊరేగించి ఉత్సవాలను ముగిస్తారు. ఈ ఊరేగింపును గ్రామస్తులు, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకిస్తారు.lal saab peerlu

నెమలి కాల్వ గ్రామంలో పీర్ల పండుగ ఉత్సవాలకు వంగాల రామస్వామి గౌడ్ ఆద్యుడు. ఆయన ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని వారసత్వంగా ఆయన కుమారుడు వంగాల లచ్చయ్య గౌడ్ కొనసాగించగా, ప్రస్తుతం వంగాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో లాల్‌సాబ్ పీర్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసే లాల్‌సాబ్ పీర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవాలకు గ్రామస్థులు, ముంబై, హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, నగరాల్లో స్థిరపడిన గ్రామానికి చెందిన వారు కూడా స్వగ్రామానికి చేరుకుని పాల్గొంటారు. బంధుమిత్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాల వైభవాన్ని మరింత పెంచుతున్నారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పీర్ల ఉత్సవాలు గ్రామ ప్రజల ఐక్యత, భక్తి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించబడుతున్న ఈ ఉత్సవాలు నెమలి కాల్వ గ్రామానికి ప్రత్యేక ఖ్యాతిని తీసుకువస్తున్నాయి.