PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 10:28 pm Posted by : PRABHATHA SURYUDU

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ఫోన్ ట్యాపింగ్ సిట్ నోటీసులు

హైదరాబాద్, ప్రభాత సూర్యుడు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. 2014 నుంచి 2018 వరకు మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం, తీగల కృష్ణారెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ అధికారులు, సంబంధిత వ్యక్తులను సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.