PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 8:52 pm Posted by : PRABHATHA SURYUDU

జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలకు వేగం

స్టాప్ డయేరియా, పల్స్ పోలియో, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై జిల్లా టాస్క్ ఫోర్స్ సమీక్ష

రంగారెడ్డి జిల్లా – ప్రభాత సూర్యుడు

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్, పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (ఎన్‌డీడీ), హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ స్వర్ణకుమారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి మాట్లాడుతూ, స్టాప్ డయేరియా క్యాంపెయిన్‌ను జూన్ 1 నుంచి 15 వరకు సన్నాహక దశగా, జూన్ 16 నుంచి జూలై 31 వరకు అమలు దశగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డయేరియా నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. https://rangareddy.telangana.gov.in/health/

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య సంస్థల్లో ఓఆర్‌ఎస్ కార్నర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని, జిల్లాలోని ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేట్ విద్యాసంస్థల ద్వారా డీ-వార్మింగ్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో మాత్రలు తీసుకోలేని పిల్లలకు జూలై 20న మాప్-అప్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

https://prabhathasuryudu.com/bhatti-vikramarka-celebrates-birthday-with-kgbv-girls-in-moinabad/

అదేవిధంగా, 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో అవగాహన పెంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.