పరస్పర అంగీకారంతో శారీరక బంధం తప్పుకాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ, ప్రభాత సూర్యుడు:
పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలను అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై నమోదైన అత్యాచార కేసును విచారించిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు చెందిన ఓ జంట కేసులో ఈ తీర్పు వెలువడింది. 2014లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అనంతరం ప్రేమ సంబంధంగా మారింది. ఈ క్రమంలో పలుమార్లు శారీరక సంబంధాలు ఏర్పడ్డాయి. తర్వాత వివాహం చేసుకోకపోవడంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అత్యాచారం కేసు నమోదు అయింది.
కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు, ఇద్దరు పెద్దవాళ్లు తమ ఇష్టప్రకారం సంబంధం కొనసాగించినప్పుడు దానిని అత్యాచారంగా పరిగణించడం సరికాదని పేర్కొంది. కేవలం వివాహం జరగలేదనే కారణంతో ప్రతి సందర్భాన్ని అత్యాచారంగా చూడలేమని స్పష్టం చేసింది.అయితే మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశంతో వివాహ హామీ ఇచ్చి సంబంధం పెట్టుకున్నట్లు నిరూపితమైతే, అలాంటి కేసులు వేరుగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడిపై నమోదైన అత్యాచార కేసును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసుల విచారణలో కీలక మార్గదర్శకంగా నిలవనుంది.