అబ్దుల్లాపూర్ మెట్ – ప్రభాత సూర్యుడు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అమరుల ఆశయాల సాధన కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర చారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్. శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు మేకం లక్ష్మి, అంజయ్య, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, బండి మధుసూదన్ రావు మరియూ మార్కెట్ ఉద్యోగులు పాల్గొన్నారు.