PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 7:38 am Posted by : PRABHATHA SURYUDU

TTD Alert: VIP దర్శనం పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

టిటిడి హెచ్చరిక.. ‘జీవితాంతం వీఐపీ దర్శనం’ పేరుతో మోసాలకు జాగ్రత్త

తిరుమల – ప్రభాత సూర్యుడు: “జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం” అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న SCP Developers సంస్థపై తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భక్తులను తప్పుదోవ పట్టించే ఈ తప్పుడు ప్రకటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది.

టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, తిరుపతి హైవేలో ప్లాట్లు కొనుగోలు చేస్తే జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని SCP Developers పేరుతో సోషల్ మీడియాలో రీల్స్ ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేట్ సంస్థకు లేదా వ్యక్తికి లేదని స్పష్టం చేసింది.

భక్తులు మోసపోవద్దని విజ్ఞప్తి

శ్రీవారి దర్శనాలు, సేవలు, టికెట్లకు సంబంధించిన అన్ని విధానాలు పూర్తిగా టీటీడీ నిబంధనల ప్రకారమే అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. టీటీడీ పేరు, శ్రీవారి ప్రతిష్ఠను వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించి భక్తులను మోసం చేసే ప్రయత్నాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక సమాచారం కోసం టీటీడీ వెబ్‌సైట్, అధికారిక ప్రకటనలు, సోషల్ మీడియా వేదికలను మాత్రమే విశ్వసించాలని సూచించారు.

టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా, సంబంధిత సంస్థ తమ ప్రచార వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు గుర్తించారు. అయినప్పటికీ భక్తులను తప్పుదోవ పట్టించినందుకు సంబంధిత సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

For Related Link : https://ttdevasthanams.ap.gov.in/


For Our More News Click Here: https://prabhathasuryudu.com/komuravelli-railway-station-inaugurated-kishan-reddy/