నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టురట్టు
రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నలుగురు అరెస్ట్, మరో ముగ్గురు పరారీ
అబ్దుల్లాపూర్మెట్ – ప్రభాత సూర్యుడు:
నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేస్తున్న ముఠా గుట్టును అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, షాద్నగర్ ఎస్ఓటీ పోలీసు బృందం సంయుక్తంగా ఛేదించింది. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితులు
ఈ నెల 1వ తేదీ రాత్రి 10.15 గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా, బాలాజీ ధాబా సమీపంలో జాతీయ రహదారి 65పై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా అందులో ఉన్న మడుపోజు కరుణాకలర్ (ఏ1), చిన్నోళ్ల మాణిక్య రెడ్డి (ఏ2), చెరుకుపల్లి రత్నాకర్ రెడ్డి (ఏ3), కరణం అజయ్ కుమార్ (ఏ4)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ రూ.500 నోట్ల కట్టలు, డమ్మీ తుపాకీ, వాకీటాకీలు, నకిలీ పోలీసు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కుంట్లూరులో నకిలీ కరెన్సీ తయారీ కేంద్రం
మంగళవారం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు కుంట్లూరులో అద్దె ఇంటిని తీసుకుని నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. కంప్యూటర్, ల్యాప్టాప్, ముద్రణ యంత్రాలు, స్కానర్, లామినేషన్ మిషన్, నోట్లను కత్తిరించే పరికరాలను ఉపయోగించి నకిలీ రూ.500 నోట్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. అద్దె ఇంటిలో 134 నకిలీ నోట్ల కట్టలు, వాహనంలో మరో 16 కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

నకిలీ పోలీసులుగా బెదిరింపులు
నకిలీ కరెన్సీ తయారీ, చలామణితో పాటు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, వాకీటాకీలు, డమ్మీ తుపాకీలను ఉపయోగించి ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ ముఠా కార్యకలాపాలపై మరింత సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో జెల్లి వెంకటేష్, కుంజా బాలరాజు, కాంపసాటి శ్రీనివాస్ సహా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ కరెన్సీ తయారీ, చలామణి వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి. రాజు పర్యవేక్షణలో షాద్నగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్, అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. రాజు, పోలీసు సిబ్బంది ఈ కేసును ఛేదించినట్లు అధికారులు తెలిపారు.
For Related Link :https://www.tspolice.gov.in/future-city
For Our More News Click Here :https://prabhathasuryudu.com/acb-rides-on-abdullahpur-net-tahsildar-and-surveyor/

