భక్తుల సౌకర్యార్థం కొత్త విధానం అమలు
జూన్ 10 నుంచి అమల్లోకి టీటీడీ నిర్ణయం
తిరుమల – ప్రభాత సూర్యుడు
శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక మార్పులు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం రోజుకు 1500 శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇందులో 500 టికెట్లను మూడు నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్‌కు కేటాయించనుండగా, తిరుపతి విమానాశ్రయంలో రోజుకు 200 టికెట్లను కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేయనున్నారు. అదేవిధంగా రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలోని 800 టికెట్లలో 300 టికెట్లను ప్రత్యేకంగా కేటాయించనున్నారు.

ఇప్పటికే రూ.10 వేల విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురుచూస్తున్న దాతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది. 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు ఈ అవకాశం వర్తించనుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ప్రత్యేక కోటా టికెట్లు విడుదల చేయనుండగా, మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న వారికి అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించనున్నారు.
కొత్త విధానం జూన్ 10 నుంచి అమల్లోకి రానుండగా, బుక్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది.

