ప్రభుత్వ ఆదాయ రక్షణకు హైడ్రా తరహాలో కొత్త సంస్థ..?
హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు:
తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో జరుగుతున్న లీకేజీలను అరికట్టేందుకు హైడ్రా తరహాలో మరో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, పలు శాఖల్లో అక్రమాలు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నాయనే నివేదికల నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆదాయానికి గండి కొడుతున్న వారిపై ప్రత్యేక నిఘా
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కొందరు అక్రమార్కులు గండి కొడుతున్నారని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయ నష్టాలను నివారించేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే చర్యలపై కఠిన నిఘా ఉంచి, అక్రమాలకు పాల్పడే వారిపై వేగంగా చర్యలు తీసుకునేలా ఈ విభాగం పనిచేయనున్నట్లు చర్చ జరుగుతోంది.
కీలక శాఖలపై ఒకే నిఘా వ్యవస్థ
వాణిజ్య పన్నులు, గనులు, పౌర సరఫరాలు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వంటి కీలక ఆదాయ శాఖల్లో అవినీతి, ఆదాయ లీకేజీలను అరికట్టేందుకు అన్ని శాఖలకు ఒకే నిఘా వ్యవస్థ ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఈ విభాగం ఏర్పడితే ప్రభుత్వ ఆదాయ వనరులపై మరింత పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ
అయితే ఈ ప్రతిపాదనపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిఘా వ్యవస్థ ఏర్పడితే శాఖల వ్యవహారాలపై మంత్రుల ప్రభావం తగ్గి, కీలక నిర్ణయాలు నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండటంతో ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

