ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్, సర్వేయర్
- లేఅవుట్ సర్వే నివేదిక కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్
హైదరాబాద్, ప్రభాత సూర్యుడు:
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. లేఅవుట్‌కు సంబంధించి సర్వే నిర్వహించి, జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఏసీబీ వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్‌కు సంబంధించిన సర్వే నివేదిక కోసం తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేయగా రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అక్టోబర్ 12న అధికారులు పథకం ప్రకారం రంగంలోకి దిగారు. రూ.20 లక్షల నగదును సర్వేయర్ శ్రీనివాసులు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించి ఆయనను కూడా అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఇద్దరు నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని , ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

