యలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు బెంగళూరు కోర్టు ఉత్తర్వులు
ఆస్తిలోకి ప్రవేశించవద్దని మధ్యంతర ఆదేశాలు
కుటుంబ సభ్యులు, అనుచరులకూ వర్తించే నిషేధం
బెంగళూరు – ప్రభాత సూర్యుడు:
యలహంక ఆస్తి వివాదానికి సంబంధించి వైఎస్ షర్మిలకు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివాదాస్పద ఆస్తిలోకి షర్మిల ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది. ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా ఆస్తిలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది.
సిలికాన్ బిల్డర్స్ సంస్థ దాఖలు చేసిన కేసును విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. యలహంకలోని సదరు ఆస్తి 2027 ఫిబ్రవరి వరకు తమ లీజులో ఉందని, ప్రస్తుతం ఆస్తి తమ స్వాధీనంలోనే ఉందని సిలికాన్ బిల్డర్స్ సంస్థ కోర్టుకు తెలిపింది.
ఈ కేసు విచారణ సందర్భంగా లీజు ఒప్పందం, అద్దె చెల్లింపులు, విద్యుత్ బిల్లులు తదితర పత్రాలను కోర్టు పరిశీలించినట్లు సమాచారం. అనంతరం ఆస్తిలోకి షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ప్రవేశించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 19 వరకు అమల్లో ఉంటాయని కోర్టు పేర్కొంది. ఆస్తి స్వాధీనం, లీజు వ్యవహారానికి సంబంధించిన వివాదంపై తదుపరి విచారణలో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

