- నాసిరకం మరమ్మతులతో మళ్లీ పైపులైన్ లీకేజీ
- ఐదు గంటల పాటు వృథాగా ప్రవహించిన తాగునీరు
అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు:
అధికారుల నిర్లక్ష్యం, నాసిరకమైన మరమ్మతుల కారణంగా విలువైన కృష్ణా తాగునీరు రోడ్లపాలవుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని అనంతపూర్ గ్రామం నుంచి ఉమ్మర్‌ఖాన్‌గూడకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడటంతో నీరు వృథాగా ప్రవహిస్తోంది. ఈ నెల 12వ తేదీ గురువారం పైపులైన్ లీకేజీని అధికారులు తాత్కాలికంగా మరమ్మతు చేశారు. అయితే మరమ్మతులు చేసిన మరుసటి రోజే, శుక్రవారం మరోసారి తీవ్రస్థాయిలో లీకేజీ ఏర్పడింది. దీంతో దాదాపు ఐదు గంటల పాటు విలువైన కృష్ణా తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహించింది. ఒకవైపు ప్రజలు తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అధికారులు నాణ్యతలేని మరమ్మతులు చేపట్టడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్య పరిష్కారం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఘటనపై విచారణ జరిపించాలని స్థానిక నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతతో కూడిన శాశ్వత మరమ్మతులు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

