ePaper
Tuesday, November 17, 2026
ePaper
Homeజిల్లా వార్తలుమావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

📰 Generate e-Paper Clip

 

  • 2014 నుంచి 2026 వరకు 829 మంది అరెస్టు
  • 918 మంది లొంగుబాటు
  • నక్సల్ ముక్త్ భారత్ పై మీడియా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు, ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ సింధు శర్మ వెల్లడి

భద్రాద్రి కొత్తగూడెం – ప్రభాత సూర్యుడు:

మావోయిస్టు కార్యకలాపాల నిర్మూలనతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ సింధు శర్మ తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘నక్సల్ ముక్త్ భారత్’ అంశంపై శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్, జిల్లా పోలీసు శాఖ, తెలంగాణ ప్రత్యేక నిఘా విభాగం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి ఐ బి) హైదరాబాద్ సంయుక్త సంచాలకులు డాక్టర్ మానస్ కృష్ణ కాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, మీడియా మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఇలాంటి సమావేశాలు కీలకమని తెలిపారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలన చర్యలు, ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో పాత్రికేయుల పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ చి. సింధు శర్మ మాట్లాడుతూ.. నక్సలిజం చరిత్ర, హింసాత్మక ఘటనలు, అభివృద్ధిపై వాటి ప్రభావాన్ని వివరించారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు చేపట్టిన వ్యూహాలు, విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు. మారుమూల, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలను విస్తరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత, పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ సేవలు చేరువ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు మాట్లాడుతూ.. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసులు చేపట్టిన చర్యలను వివరించారు. 2014 నుంచి 2026 వరకు జిల్లాలో 829 మంది అరెస్టు కాగా, 918 మంది మావోయిస్టు కార్యకర్తలు లొంగిపోయినట్లు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవలు, వైద్య శిబిరాలు, రహదారి సదుపాయాలు, సౌర విద్యుత్ దీపాలు, పాఠశాలలు, క్రీడా సదుపాయాలు, సామాజిక భవనాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ మీడియా, సమాచార అధికారి వర్గంటి గాయత్రి, జిల్లా పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!