అక్రమ అబార్షన్ కేంద్రంపై పోలీసుల దాడి
ఇద్దరు అరెస్ట్.. న్యాయమూర్తి ఎదుట హాజరు
నాగోల్ – ప్రభాత సూర్యుడు
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో అక్రమంగా గర్భస్రావాలు (అబార్షన్లు) నిర్వహిస్తున్న వ్యవహారం పోలీసుల డెకాయ్ ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది. మహిళల ఆరోగ్యంతో పాటు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విధంగా ఎలాంటి వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, జైపురి కాలనీ రోడ్ నెం-2లో బండారు వెంకట లక్ష్మి “కేసరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్” పేరుతో కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అక్కడ అక్రమంగా అబార్షన్లు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ ఎల్‌బీనగర్ బృందం, నాగోల్ పోలీసులు సంయుక్తంగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. https://malkajgiripolice.telangana.gov.in/
గర్భిణీ మహిళగా ఓ మహిళా కానిస్టేబుల్‌ను కేంద్రానికి పంపగా, అక్కడ ఉన్న వీర రేవతి (50) ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే గర్భస్రావం చేసేందుకు ముందుకు వచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ నుంచి రూ.10 వేల నగదు తీసుకుని అబార్షన్‌కు సిద్ధమవుతుండగా పోలీసులు దాడి చేసి వ్యవహారాన్ని బట్టబయలు చేశారు.సెంటర్‌లోని రికార్డులు, మందులు, వైద్య పరికరాలు తదితర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం, అక్రమ గర్భస్రావాలు నిర్వహించడం, సంబంధిత చట్టాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో బండారు వెంకట లక్ష్మి, వీర రేవతిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు నాగోల్ ఇన్‌స్పెక్టర్ మక్బుల్ జానీ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. అనుమతులు పొందిన ఆసుపత్రులు, అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే వైద్య సేవలు పొందాలని, ఇలాంటి అనధికారిక కేంద్రాలను ఆశ్రయించి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
For More Updates Click :https://prabhathasuryudu.com/irrigation-project-land-acquisition-review-by-commissioner-shivakumar-naidu/

