కాంగ్రెస్‌లో హాట్ టాపిక్
డిల్లీ/హైదరాబాద్, ప్రభాత సూర్యుడు
తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళనపై ఊహాగానాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. జూన్ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతున్న వేళ, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
రాష్ట్ర కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కోసం పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా రాహుల్ గాంధీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ప్రస్తుతం స్పీకర్‌గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్, తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవికి రాజ్యాంగపరంగా ఉన్న గౌరవం ఉన్నప్పటికీ, ప్రజల మధ్య ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం, కార్యనిర్వాహక అధికారాలు మంత్రి పదవిలోనే ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో స్పీకర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల కారణంగా తనను అనవసర వివాదాల్లోకి లాగారని, రాజకీయంగా నష్టపోయాననే భావనలో గడ్డం ప్రసాద్ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ లోపల పోటీ తీవ్రంగా ఉంది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపించడం గమనార్హం.
అయితే రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో అసలు ఏం చర్చించారన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఈ భేటీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. స్పీకర్‌గా కొనసాగుతారా..? లేక మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
జూన్ నెలాఖరులో జరిగే మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, గడ్డం ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీ సాధారణ మర్యాదపూర్వక సమావేశమా..? లేక మంత్రి పదవికి సంబంధించిన రాజకీయ మంతనాలా..? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

