దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో ఊహించని పరిణామాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. సుమారు 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానంలో మధ్యంతరంగా పైలట్ల మధ్య వివాదం తలెత్తి, ఏకంగా కత్తితో దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ విమానం అత్యవసర కోడ్‌లను జారీ చేయగా, అప్రమత్తమైన అధికారులు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా దించారు. ఈ విమానంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ జాతీయులు ఉన్నారు.
గాల్లో ఏం జరిగింది?
విమానం ప్రయాణిస్తున్న సమయంలో కో-పైలట్‌పై ఒక పైలట్ (ఒమన్ జాతీయుడిగా భావిస్తున్నారు) కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ పెనుగులాట సమయంలో విమానం అకస్మాత్తుగా సుమారు 15,000 మీటర్ల మేర కిందకు పడిపోయింది. క్యాబిన్ లోపల కేకలు వినిపించాయని, ఒక వ్యక్తి కత్తి దూసి పైలట్‌ను కింద పడేశాడని, రక్తం కూడా కనిపించిందని మిరియం అనే ప్రయాణికురాలు తన తల్లికి వివరించినట్లు తెలిసింది. అదనపు సిబ్బంది, కొందరు ధైర్యవంతులైన ప్రయాణికుల సాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సదరు పైలట్ ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేయాలని భావించాడా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్రమత్తమైన ఇజ్రాయెల్.. రంగంలోకి ఫైటర్ జెట్స్
ఈ ఘటన ప్రారంభం కాగానే, విమానం నుంచి సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే ‘కోడ్ 7700’, ఆ వెంటనే చట్టవిరుద్ధమైన జోక్యం (హైజాక్) జరుగుతోందని సూచించే ‘కోడ్ 7500’ ఏటీసీకి అందాయి. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దళం తక్షణమే అప్రమత్తమై యుద్ధ విమానాలను గాల్లోకి పంపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రక్షణ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ గగనతలాన్ని కొద్దిసేపు మూసివేశారు.
ప్రయాణికులు సేఫ్: ఫ్లైదుబాయ్
విమానం సౌదీలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇజ్రాయెల్, ఎయిర్‌లైన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది హైజాక్ కాదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఇజ్రాయెల్ పీఎంవో స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనపై స్పందించిన ఫ్లైదుబాయ్ సంస్థ.. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని, ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నారని ప్రకటించింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

