– లష్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణ అంశంపై హుటాహుటిన ప్రెస్‌మీట్
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆందోళనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు
– అభివృద్ధిపై విమర్శలు ఖండించిన మండల కాంగ్రేస్ నాయకులు
అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 23 (ప్రభాత సూర్యుడు)
లష్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ధర్నా రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనకు స్పందనగానే కాంగ్రెస్ ఈ సమావేశం ఏర్పాటు చేసిందనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ బి-బ్లాక్ అధ్యక్షుడు సిహెచ్ భాస్కర్ చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ నేతల విమర్శలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే లష్కర్‌గూడ బ్రిడ్జి అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కోహెడలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నియోజకవర్గంలో చేపడుతున్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను కాంగ్రెస్ నేతలు ప్రస్తావించారు. అనంతరం భాస్కర్ చారి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కృషితో నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్టు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్లొన్నారు. కాగా, లష్కర్‌గూడ బ్రిడ్జి అంశంపై బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన తర్వాతే కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

