కాక్‌పిట్‌లో భారత కెప్టెన్‌పై కత్తితో కో-పైలట్ దాడి
ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్ స్మిత్ మచార్
సిబ్బంది, ప్రయాణికుల సాయంతో నిందితుడి బంధీ
సౌదీ అరేబియాలో విమానం సురక్షిత ల్యాండింగ్
టెల్ అవీవ్: నడిగగనంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకున్న ఓ ఉన్మాది యత్నాన్ని భారత పైలట్ సమయస్ఫూర్తితో భగ్నం చేశాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా 170 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా కాపాడాడు. టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఈ హైజాక్/కూల్చివేత కుట్రను భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ అత్యంత ధైర్యసాహసాలతో తిప్పికొట్టారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా భారత పైలట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
34 వేల అడుగుల ఎత్తులో కత్తితో దాడి..
ఫ్లై దుబాయ్ విమానం టెల్ అవీవ్‌కు బయలుదేరింది. విమానం 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఒక్కసారిగా ఉన్మాదంతో రగిలిపోయాడు. కాక్‌పిట్‌లో ప్రధాన పైలట్‌గా ఉన్న భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచార్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం విమానాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకొని కూల్చేసేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పెనుగులాటలో విమానం అకస్మాత్తుగా కొన్ని వేల అడుగుల కిందకు పడిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన కెప్టెన్ స్మిత్ వెంటనే కంట్రోల్ రూమ్‌కు అత్యవసర (ఎమర్జెన్సీ) కోడ్‌లను పంపారు.
ప్రయాణికుల సాయంతో నిందితుడి బంధీ..
ఒకవైపు కో-పైలట్ కత్తితో దాడి చేస్తున్నప్పటికీ కెప్టెన్ స్మిత్ మచార్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధీరుడిలా ప్రతిఘటించారు. అదే సమయంలో విమానం కిందకు పడిపోతుండటాన్ని గమనించిన ప్రయాణికులు, విధుల్లో లేని ఇతర సిబ్బంది ప్రాణాలకు తెగించి కాక్‌పిట్‌లోకి చొరబడ్డారు. కెప్టెన్‌పై దాడి చేస్తున్న కో-పైలట్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన కెప్టెన్ స్మిత్ మచార్ విమాన నియంత్రణను తిరిగి తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా, సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ప్రాణదాతలంటూ నెతన్యాహు ప్రశంసలు..
భారీ ప్రాణనష్టాన్ని నివారించిన కెప్టెన్ స్మిత్ మచార్, సిబ్బందిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. “అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన నిజమైన హీరోలు” అని ఆయన వారిని కొనియాడారు. వారి సకాల స్పందన వల్ల అతిపెద్ద విపత్తు తప్పిందని పేర్కొన్నారు. భారత పైలట్ చూపిన తెగువ పట్ల ఇజ్రాయెల్ వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

