స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.!!
- ప్రతిపక్షాలదీ పస లేని ఆరోపణలు
- కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
- త్వరలో రేషన్ కార్డుఉన్న వారికి సన్న బియ్యం
- మూసీ ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి
సూర్యాపేట - ప్రభాత సూర్యుడు
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధం కావాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని హుజూర్ నగర్, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలన్నారు. హుజూర్ నగర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, ఏడుసార్లు తనను ఒకే ప్రాంతం నుంచి గెలిపించిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు.
హుజుర్నగర్ లో ఆదర్శ డిగ్రీ కళాశాల..
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోనీ డిగ్రీ కళాశాలను ఆదర్శంగా తీర్చిదుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డిగ్రీ కళాశాల గడిచిన పదేండ్లు నిర్లక్ష్యానికి గురైందన్నారు. అన్ని హంగులతో నూతన కళాశాల భవనం నిర్మించి రాష్ట్రంలోనే ఆదర్శ డిగ్రీ కళాశాలగా తీర్చిదిద్దుతామన్నారు. డిగ్రీ కళాశాలతో పాటు జూనియర్ కళాశాలకు కొత్త భవనాలు నిర్మించడంతోపాటు అదనపు తరగతి గదులు నిర్మిస్తామని వెల్లడించారు.
రికార్డు స్థాయిలో వరి ధాన్యం..
భగవంతుడు దయతో జిల్లాలో సాగునీటికి ఎలాంటి ఢోకా లేదని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రెండు సార్లు నిండిందని మంత్రి తెలిపారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ వరి ధాన్యం సాగు అయిందని వివరించారు. 66.07లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయిలో ధాన్యం పండిందన్నారు. 21 లక్షల మంది రైతులకు రుణామాఫీ చేశామని, ఈనెల 30 నాటికి మిగిలిన రైతులకు కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
త్వరలో రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. రబీ సీజన్ లో రైతు భరోసా అందిస్తామన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. సామాజిక న్యాయం అందిస్తూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనారవి, వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరావు, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ కృష్ణయ్య, రామారావు, నేరేడుచర్ల మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రకాశ్, వైస్ చైర్మన్ సరితా సైదిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలవి.. పసలేని ఆరోపణలు..
మూసీ ప్రక్షాళన, బీసీ కులగణన చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటూ ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన వారు పనికి మాలినమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని, మూసీ ప్రక్షాళన పూర్తయితే నీటి కాలుష్యం తగ్గుతుందన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగి పోయిందని, దీనిపై ఎంక్వైరీ పూర్తి కాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.