AP News : రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో ఊరట
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సంబంధించి నమోదైన కేసు

రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో ఊరట
అమరావతి - ప్రభాత సూర్యుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సంబంధించి నమోదైన కేసులో విచారణపై హైకోర్ట్ స్టే విధించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి తీయడంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆర్జీవీపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. అయితే ఈ పిటిషన్‌కి సంబంధించి ఆర్జీవీ తరపు న్యాయవాదులు నేడు తమ వాదన వినిపిస్తూ.. 2019లో విడుదలైన సినిమాపై ఇన్నాళ్లకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని వాదించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి? అని ప్రశ్నించింది. అలాగే ఈ కేసుపై విచారణకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్జీవీపై సీఐడీ తదుపరి చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.