Soundarya Murder Case Issue : సౌందర్య మరణంపై మొదటిసారి స్పందించిన భర్త రఘు
జల్‌పల్లిలోని సౌందర్య కు చెందిన ఆరు ఎకరాల భూమే కారణం

మోహన్‌బాబుతో మాకెలాంటి భూ లావాదేవీలు లేవు
-సౌందర్య ఆస్తులతో మంచు కుటుంబానికి సంబంధం లేదు
-ఆరోపణలను తోసిపుచ్చిన సౌందర్య భర్త రఘు
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
సినీ నటులు మంచు మోహన్ బాబు, సౌందర్య ఆస్తి వ్యవహారం తెలుగు రాష్టాల్ల్రో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి సంబంధించిన ఆరు ఎకరాల భూమిని సౌందర్య నుంచి ఆయన అక్రమంగా లాక్కున్నారని, అలాగే సౌందర్యను మోహన్ బాబు హత్య చేయించారంటూ ఖమ్మం జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ వార్త ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే దీనిపై సౌందర్య భర్త రఘు స్పందించారు. సౌందర్య మరణంలో మోహన్ బాబు పాత్ర ఏమి లేదని, తమ ఆస్తిని ఆయన లాక్కున్నారనే ఆరోపణలను రఘు ఖండిరచారు. హైదరాబాద్‌లోని ఆస్తి విషయమై కొన్ని రోజులుగా తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. తన భార్య సౌందర్య నుంచి మోహన్ బాబు అక్రమంగా పొందిన ఆస్తి ఏదీ లేదని రఘు తేల్చి చెప్పారు. తనకు తెలిసినంత వరకూ మోహన్ బాబుతో తాము ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేదని స్పష్టం చేశారు. మోహన్ బాబుతో తమకు 25 ఏళ్లుగా బలమైన మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
తన భార్య, బావ, అలాగే ఇరుకుటుంబాలు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆస్తి వ్యవహారంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, తమ నుంచి ఆయన ఎలాంటి ఆస్తులూ స్వాధీనం చేసుకోలేదని మరోసారి సుస్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయె?ద్దని కోరుకుంటున్నట్లు రఘు విజ్ఞప్తి చేశారు. కాగా, 17 ఏప్రిల్ 2004న లోక్ సభ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌లో వెళ్తూ ప్రముఖ నటి సౌందర్య చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమర్నాథ్ సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఖమ్మం జిల్లా ఏదులాపురానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమళ్లు అనే వ్యక్తి ఖమ్మం కలెక్టర్, రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ జల్‌పల్లిలో సౌందర్యకు ఆరు ఎకరాల్లో ఎస్టేట్ ఉందని, దాన్ని అమ్మాలని మోహన్ బాబు ఆమెపై ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సౌందర్య ఒప్పుకోకపోవడంతో సాక్ష్యాలు దొరక్కుండా హత్య చేయించారని ఆరోపించాడు. వెంటనే మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశాడు.