BRS Silver Jubilee : బిఆర్ఎస్ రజతోత్సవ సభకు కవితకు నో ఎంట్రీ ?
ఆసక్తికరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్

Kalvakuntla's family politics are interesting
ఆసక్తికరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్
నిజామాబాద్ - ప్రభాత సూర్యుడు
వరంగల్‌లో బీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్లీనరీ సభపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైలెంట్ అయ్యారు. ఆమెకు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానం లేదా? అందుకే సన్నాహక సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారా? ప్రస్తుతం గులాబీపార్టీ శ్రేణుల్లో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. దానికి తగ్గట్లే నిజామాబాద్ జిల్లా నేతల సమావేశాలకు సైతం ఆమె హాజరుకావడం లేదు. పార్టీ పరంగా సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె సొంత ప్లాట్ ఫాం జాగృతితో యాక్టీవిటీస్ చేస్తున్నారనే చర్చజరుగుతుంది. ఇక మున్ముందు కూడా మరింత దూకుడు పెంచాలని కవిత ఆలోచిస్తున్నట్లు సమాచారం. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 27న వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభను విజయవంతం చేసేందుకు గులాబీపార్టీ సకల ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడికక్కడ పార్టీ కేడర్‌ను సైతం పార్టీ నాయకులు సన్నద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జనం తరలింపుపై సలహాలు, సూచనలు తీసుకుంటూ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎవరికి వారు బిజీగా ఉన్నారు. కానీ కవిత మాత్రం పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, వరంగల్ సభ ఏర్పాట్లకు సంబంధించి సైలెంట్‌గా ఉన్నారు. ఇంతకూ వేడుకలను ఆహ్వానం అందలేదా?.. కావాలని పార్టీ ఆమెను పక్కన పెట్టిందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడు పార్టీలో యాక్టివ్ గా ఉండే కవిత పార్టీ సభ విషయంలో ఎందుకు స్పందించడం లేదనేది ఆమె క్యాడర్‌కే అంతుపట్టడం లేదంట. గ్రేటర్‌లో జరుగుతున్న పార్టీ సన్నాహక సమావేశాల్లో సైతం పాల్గొనడం లేదు. కావాలని ఆహ్వానించడం లేదా? లేకుంటే ఆమె తెలంగాణ జాగృతి సంస్థ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉండటంతో పాల్గొనడం లేదా? అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన కవిత 2019లో ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తిరిగి 2021 నవంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఆ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి పట్టుకుంది. కేడర్, నేతలతోనూ పరిచయాలు ఉన్నాయి. పార్టీ సన్నాహక సమావేశాలు అన్ని జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్నాయి. అయితే కవిత మాత్రం ఇప్పటివరకు వెళ్లలేదు. పార్టీ కేడర్ ను సభకు సన్నద్ధం చేయడం లేదు. అంతేకాదు ఇటీవల వారం రోజులపాటు ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతోనూ ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు సైతం కేసీఆర్ కుమార్తె వెళ్లలేదు. ఇప్పుడు సొంత జిల్లా నిజామాబాద్ లో జరుగుతున్న సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో ఆమెకు పార్టీ సమావేశాలు నిర్వహించమని చెప్పలేదా? ఆ జిల్లా అధ్యక్షుడు ఆహ్వానించడం లేదా? అసలు పార్టీ పెద్దలే ఆమెను దూరం పెడుతున్నారా? అనేది తెలంగాణ జాగృతి కార్యకర్తల్లో తీవ్ర గందరగోళానికి కారణమవుతుంది. అయితే పార్టీ సమావేశాలు నిర్వహించమని ఆదేశాలు లేకపోవడంతోనే కవిత ఆ జిల్లాకు వెళ్లడం లేదంట కవిత సొంత ప్లాట్‌ఫాం జాగృతితో యాక్టవిటీస్‌ను ముమ్మరం చేశారు. తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి.. ప్రాచుర్యం కల్పించేందుకు 2006 ఆగస్టులో ఆమె తెలంగాణ జాగృతి సంస్థని ఏర్పాటు చేశారు. నాటి నుంచి జాగృతి సంస్థ బతుకమ్మ ఉత్సవాలతో పాటు సేవాకార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తుంది. ప్రస్తుతం బీసీ, మహిళ అంశంతో ముందుకు సాగుతుంది. 42శాతం రిజర్వేషన్లపై పోరాటం సాగిస్తూనే మరోవైపు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలన్న డిమాండ్‌తో ప్రతిజిల్లాలో ధర్నాలు, నిరసనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవి దృష్టికి వచ్చినా వాటిపై గళం వినిపిస్తున్నారు. జాగృతితో పాటు ఫూలే ఫ్రంట్ తో కార్యచరణ కొనసాగిస్తున్నారు.నె క్లెస్ రోడ్డు పరిసరాల్లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచనను స్వాగతిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌పై విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయడం అభినందనీయమన్నారు. అలాగే అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదలా ఉంటే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో ప్రభుత్వం కులగణన తప్పుల తడకగా ఉందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. కానీ కవిత మాత్రం మండలిలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి ఆమె సపోర్టు చేస్తున్నారనే ప్రచారం సైతం జరిగింది.
కవిత తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని సహకరించాలని వామపక్షాల మద్దతు కోరుతున్నారు. సీపీఎం జాగృతి కార్యక్రమాలకు మద్దతు ఇస్తామని, కానీ బీఆర్‌ఎస్ పార్టీగా చేస్తే మాత్రం ఇవ్వబోమని ఖరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు సీపీఐ పార్టీ మద్దతు సైతం కూడగడుతున్నారు. ఆ పార్టీ నేతలతోనూ ఒకటి రెండ్రోజుల్లో భేటీ కాబోతున్నట్లు సమాచారం. జాగృతి చేసే కార్యక్రమాలకు కలిసి వచ్చే పార్టీలన్నంటితోనూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటాల్లో మరింత దూకుడు పెంచేందుకు కవిత సిద్ధమవుతున్నారంట. గతంలో ఎన్నడూ లేని విధంగా సొంతంగా రాజకీయంగా ఎదగాలని, తన సత్తా ఏంటో చూపాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఒక వైపు జాగృతి, మరోవైపు ఫూలే ఫ్రంట్ తో ప్రజలకు దగ్గరై, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి కీలక నేతగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె అనుసరిస్తున్న వ్యూహాలే స్పష్టం చేస్తున్నాయంటున్నారు. ఎఅందులో భాగంగానే జాగృతి కమిటీలు గ్రామస్థాయిలో ఏర్పాటు చేసి సంస్థను పటిష్టం చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. మొత్తవ్మిూద కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్ ఆసక్తికరంగా తయారయ్యాయిప్పుడు.