Kakinada Port: అంతా క్లియర్‌... పోర్టు వివాదానికి ఫుల్‌ స్టాప్‌

Kakinada Sea Port allotted to KV Rao, Kakinada SEZ allotted to Aurobindo

On
Kakinada Port: అంతా క్లియర్‌... పోర్టు వివాదానికి ఫుల్‌ స్టాప్‌

అంతా క్లియర్‌...
పోర్టు వివాదానికి ఫుల్‌ స్టాప్‌

కాకినాడ - ప్రభాత సూర్యుడు

కాకినాడ సీ పోర్టుకు సంబంధించి గత కొన్ని నెలలుగా జరుగుతున్న వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. కేవీరావుకు కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాలను అరబిందో తిరిగి ఇచ్చేసింది. దీంతో కాకినాడ సెజ్‌ అరబిందో వశమైంది. కేవీరావుకు కాకినాడ సీ పోర్టు, అరబిందోకు కాకినాడ సెజ్‌ కేటాయింపుపై రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో గత ఎనిమిది నెలలుగా సాగుతోన్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయింది.అప్పట్లో రూ.2,500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను తన వద్ద రూ. 494 కోట్లకే లాగేసుకున్నారని కేవీరావు ఆరోపించారు. అదే సమయంలో కాకినాడ సెజ్‌లో కేవీరావుకు చెందిన 8 వేల ఎకరాలు అరబిందో సొంతమైంది. వైసీపీ హయంలో బలవంతంగా వాటాలను బదిలీ చేసుకున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేశారు. సీఐడీ ఫిర్యాదు ఆధారంగా రూ.494 కోట్ల చెల్లింపులపై ఈడీ కూడా రంగంలోకి దిగి, మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఇప్పటికే వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, వైవీ విక్రాంత్‌ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. దీంతో ఈ వివాదం కీలకమలుపు తిరిగింది. కేవీరావు నుంచి అప్పట్లో తీసుకున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. దీంతో కాకినాడ సీపోర్టు డీల్‌ రివర్స్‌ అయింది. కాకినాడ సీపోర్టు మళ్లీ పాత యజమాని కేవీరావు చేతికే దక్కిందికాకినాడ సీపోర్టుకు సంబంధించిన 41.12 శాతం వాటాలను కేవీరావుకు మూడు రోజుల క్రితమే అరబిందో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై పై స్థాయిలోని వ్యక్తులు రంగంలోకి దిగి, ఇరు పక్షాలను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేశారని సమాచారం. పెద్ద స్థాయిలోనే డీల్‌ కుదిరినట్లు సమాచారం. పోర్టులోని వాటాలను బదిలీ చేసేందుకు సిద్ధపడిన అరబిందో ఒక షరతు పెట్టింది. సెజ్‌ను వదిలేయాలంటూ షరతు విధించింది. దీనికి సమ్మతించిన తరువాతే అరబిందో పేరుతో ఉన్న 2.15 కోట్ల షేర్లు కేవీరావుకు బదిలీ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి అప్పట్లో కేవీరావుకు అరబిందోకు ఇచ్చిన మొత్తాన్ని, షేర్లు బదిలీ చేయడంతో తిరిగి అరబిందోకి కేవీరావు ఇచ్చేశారని తెలిసింది. దీంతో కాకినాడ పోర్టు కేవీరావు వశమైంది. మరోవైపు కాకినాడ సెజ్‌లో ఉన్న కేవీరావుకు చెందిన 8 వేల ఎకరాలను అరబిందో వశమైంది. ఇప్పుడు ఎవరి వ్యాపారాలు వారు చేసుకోవాలని పెద్దలు రాజీ కుదిర్చిన సమయంలో పేర్కొన్నట్లు తెలిసింది.1990లో కాకినాడ సీపోర్టును ఏడీబీ రుణంతో నిర్మించారు. ప్రభుత్వం నిర్మించిన ఈ పోర్టును 1998లో చంద్రబాబు, దాని నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇచ్చారు. అలా ఆ పోర్టు కేవీరావుకు వచ్చింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అండతో కేవీరావుకు చెందిన కాకినాడ సీపోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని 41 శాతం వాటాలను అరబిందో రియాల్టీ బదిలీ అయ్యాయి. అప్పుడు అరబిందో యాజమాన్యం తాము 41 శాతం వాటాలను కొనుగోలు చేసుకున్నామని చెప్పింది. అయితే కేవీరావు మాత్రం తనను బెదిరించి వాటాలను లాక్కొన్నారని ఆరోపించారు. అంతేతప్ప వాటిని తిరిగి పొందడానికి పెద్దగా న్యాయపోరాటం చేసిన దాఖలాలు లేవు. ఏం చేసిన ఫలితముండదని కేవీరావు భావించి ఉండొచ్చని పలువురు అంటున్నారుఅయితే 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు మిన్నకున్న కేవీరావు ఒక్కసారిగా అరబిందో తనను బెదిరించి సీపోర్టులోని వాటాలను లాక్కొందని విమర్శిస్తూ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి విచారణ మొదలెట్టింది. అరబిందోకు చెందిన విక్రాంత్‌ రెడ్డికు సీఐడీ నోటీసులు ఇచ్చింది. సీఐడీ విచారణ ప్రారంభించింది. మరోవైపు ఈడీ కూడా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. దీంతో విక్రాంత్‌ రెడ్డి బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో కేవీరావు ఇన్‌ప్లీడ్‌ అయ్యారు. ఇలా కాకినాడ పోర్టు వివాదం సాగుతున్న నేపథ్యంలో వాటాలను వెనక్కి ఇచ్చేందుకు అరబిందో అంగీకరించి, బదిలీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్టు అయింది.

Views: 3

Latest News