HCU Land Issue : ప్రకృతినీ ముట్టుకుంటే విధ్వంసంకు రెడ్ కార్పేట్ పరచినట్టే..!
ప్రభాత సూర్యుడు - ఎక్స్క్లూజివ్ స్టోరీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లోని వన్యప్రాణులు
ప్రకృతినీ ముట్టుకుంటే విధ్వంసంకు రెడ్ కార్పేట్ పరచినట్టే..!
"అది యూనివర్సిటీ భూమా...? ప్రభుత్వ భూమా..? అనే విషయం కాసేపు పక్కన పెట్టి తెలంగాణ ప్రజలారా మనందరం ఆలోచన చేద్దాం"
ప్రభాత సూర్యుడు - ఎక్స్క్లూజివ్ స్టోరీ
అది హైద్రాబాద్ కు ఆక్సిజన్ ఇచ్చే పచ్చటి అడవి. తీరొక్క జీవరాశికి ఆదెరువు. చెట్లు చెమలు కూలగొట్టి...చెరువులు పూడ్చేశి... నెమళ్లను జింకలని తరిమి...కుందేళ్లను గెదిమి...పచ్చని భూములనీ అమ్మకానికి పెడ్తం అంటున్నరు.
అక్కడ ఏమైనా పులులు, సింహాలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయి, అంతే అంటున్న నాయకుల మాటలు విన్నాక.,
అంటే వాళ్ళ మాట ప్రకారం పులులు సింహాలు ఉంటే అడవిని ధ్వంసం చేయొచ్చా చెప్పండి మీరే? నక్కలైన, పులులైన, నెమళ్ళు, జింకలైన, కోతులైన సమస్త జీవరాశికి ఆ అడవినే కదా ఆధారం. వేల కోట్ల రూపాయలుకు భూములు అమ్మి.. అద్దాల మేడలు...అందాల బంగ్లాలు కట్టడమే అభివృద్ధి అనుకుంటున్నారా ఎట్ల పాలకులు ?
ఇప్పటికే రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల గుట్టలు మింగిర్రు...అడవులు నరికిండ్రు...చెరువులు కబ్జా వెట్టిండ్రు. ఎత్తైన ఆకాశ హర్మహారాలు కట్టినరు.ఇప్పటికే గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, నానక్ రామ్ గూడల ప్రకృతిని సర్వ నాశనం జేశి అద్దాల మేడలు కట్టినరు. అదే అసలైన అభివృద్ది అన్నట్టు పోటీపడుతున్నారు పాలకులు.
దామగుండం రాడార్ స్టేషన్ కోసం వెయ్యి ఎకరాల అడవిని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే...ఎన్ని వేల చెట్లు కొట్టెయ్యాలె...ఎన్నో మూగ జీవాలు బలిగావాలె...ఎంత ప్రకృతి విధ్వంసం జరుగాలె. రేడియేషన్ తో డేంజర్ అన్నారు. ఇదేందని అడిగితే...అది దేశ రక్షణ కోసం అన్నరు..దేశమంటే మనుషులే కదా?
మరి ఇప్పుడు ఆ జనం కోసమే గచ్చిబౌలి భూమి అమ్మేస్తరట. మనకెం బాధని ఊకుందామా..? జనతా గ్యారేజీ వంటి సీన్మా చూసి చప్పట్లు కొడతాం..వావ్ అంటాము, కానీ కండ్ల ముందే పచ్చనీ అడవినీ ఖతం చేయాలనీ చూస్తే చోద్యం చూస్తాము. మేమంతా ప్రకృతి ప్రేమికులం, ప్రకృతి మీద ఎంత ప్రేమంటే అది చూపించుకోవడానికి అనిపించుకోవడానికి అందమైన ఫోటోలు..మంచి మాటలు, సూక్తులు రాసి లైకులు, కామెంట్లు తెచ్చుకుంటాం.
గతంలో మన హైదరాబాద్ లో విలువైన భూములు అమ్మితే వేల కోట్లు రూపాయలు వచ్చినయి..100 కోట్లకు ఒక్క ఎకరం అమ్మిన ప్రభుత్వాలు...హైద్రాబాద్ ప్రపంచ పటంలో గొప్పగా ఎదిగిపోతోందని చూపించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అమ్ముతా అంటుంది అంతేనా ?..
ప్రాజెక్టుల కోసం ఊర్లకు ఊర్లను ఖాళీ చేయించి రైతుల భూములు గుంజుకునీ అభివృద్ధి కోసం అంటారు. అప్పుడు ఆళ్లది తప్పే..ఇప్పుడు ఈళ్లది తప్పే.. ప్రకృతినీ వేలానికి వేసినప్పుడల్లా.... మేధావులు ఎక్కడవొయినారు, కవులెందుకు రాస్తలేరు..? కళాకారులెందుకు పాడ్తలేరు..? అంటరు. మనందరికీ బాధ్యత ఉండాలి కదా? మనము కూడా మంచో చెడో గమనించాలి కదా?
పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా ప్రకృతిని ముట్టుకుంటే విధ్వంసాన్ని స్వాగతించడమే కదా!
వ్యాసకర్త✍️
శేఖర్ పగిళ్ళ
సీనియర్ జర్నలిస్ట్