తంతే పూల బుట్టలో పడటం అంటే ఇదే
పెళ్ళానికి గోల్డ్ చైన్ కొనబోతే 8 కోట్లు వరించాయి
చైన్ కొంటే 8 కోట్లు లక్కీ డ్రా
చెన్నై - ప్రభాత సూర్యుడు
ఒక్కో సారి కష్టమైనా భార్య అడిగితే ఓ ఉంగరమో..బొంగరమో కొనిపించడం మంచిది. ప్రశాంతంగా ఉండటానికే కాదు అప్పుడప్పుడూ లక్కీ చాన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేలు పెట్టి కొంటే కోట్లలో రిటర్న్స్ వస్తాయి. అందరికీ కాకపోయినా కొంత మందికి ఇలాంటి అవకాశం లభిస్తుంది. దీనికి బాలసుబ్రమణియన్ చిదంబరం అనే వ్యక్తే ఉదాహరణ. తమిళనాడుకు చెందిన బాలసుబ్రమణియన్ చిదంబరం సింగపూర్‌లో సైట్ ఇంజినీర్ గా చాలా కాలంగా పని చేస్తున్నారు. కుటుంబంతో సహా అక్కడే సెటిల్ అయ్యారు. చాలా కాలంగా భార్య బంగారు చైన్ కొనివ్వమని పోరు పెడుతోందని ఈ మధ్య ఓ బంగారు దుకాణానికి తీసుకెల్లాడు. అక్కడ కొనుగోలు చేసే వారి కోసం ఆ దుకాణాన్ని నిర్వహిస్తున్న గ్రూప్ ఓ డ్రా నిర్వహిస్తోంది. అయితే ఆ డ్రా గురించి అంత సీరియస్ తీసుకోలేదు. కాస్త ఖర్చు ఎక్కువ అయినా భార్యకు మంచి చైన్ కొనిచ్చి వెళ్లాడు. ఆ ఈఎంఐలు ఎలా సర్దుబాటు చేయాలా అనే లెక్కలేసుకుని ఉంటాడు. అయితే ఓ రోజు ఆయన గోల్డ్ దుకాణం నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అటెండ్ చేసిన ఆయనకు మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది. డ్రాలో ఆయనకు మిలియన్ డాలర్ల బహుమతి వచ్చిందని చెప్పారు. అంటే ఎనిమిది కోట్ల పైమాటే. ఇంకేముంది ఉబ్బితబ్బిబ్బయిపోయారు. నగల దుకాణంలో సిబ్బందితో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆయన వీడియో వైరల్ అయిపోయింది. తన తండ్రి డెత్ యానివర్శిటరీ రోజు ఈ కబురు చెప్పారని.. తన తండ్రే ఈ నగదు పంపించి ఉంటారని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మొత్తాన్ని చారిటీకి వెచ్చిస్తానని ఆయన ప్రకటించారు.