Hyderabad Kidny Rocket: హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
అలకనంద ఆస్పత్రిలో అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి
అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్
- ఇతర రాష్ట్రాల నుంచి పేషెంట్ల తరలింపు
- విశ్వసనీయ సమాచారంతో అధికారుల దాడులు
- ఆస్పత్రి సీజ్, డాక్టర్‌పై చర్యలకు సిద్ధం
- చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు
కాసులకు కక్కుర్తి పడి ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా కిడ్నీలు మార్పిడి చేస్తున్న సంఘటన మంగళవారం సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో గల అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వెలుగుచూసింది.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన నలుగురిని తీసుకువచ్చి కిడ్నీలు మార్పిడి చేస్తున్నారు. స్థానికంగా ఉండే కొన్ని ఆసుపత్రులతో కుమ్మక్కె అమాయకుల్ని ఆసరాగా చేసుకొని కిడ్నీలను మార్పిడి చేస్తూవాటిని అమ్ముకుని లక్షలలో డబ్బులు దండుకుంటున్నారు. అక్రమంగా ఆపరేషన్లు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతోని రంగారెడ్డి జిల్లా DM & HO వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఉజ్బెకిస్తాన్ లో చదివిన డాక్టర్ పేరిట పర్మిషన్ ఉండగా ఒక ఫిజీషియన్, ఒక ప్లాస్టిక్ సర్జన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఉన్నది. యూరాలజిస్ట్ డాక్టర్ పర్మిషన్ ఆసుపత్రికి లేదు. దీంతో అలకనంద ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. డాక్టర్లు పరారీలో ఉండగా అలకనంద హాస్పిటల్ ఎండి సుమంత్ చారీని, ఆసుపత్రి సిబ్బందిని సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. బాధిత రోగులను హుటాహుటిన అక్కడ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనుమతి లేకుండా, అక్రమంగా ఆపరేషన్లు చేస్తే సహించేది లేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆస్పత్రులను ఉపేక్షించేది లేదన్నారు. అవసరమైతే ఆయా డాక్టర్లపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్వో గీత, సరూర్ నగర్ పి హెచ్ సి వైద్యురాలు అర్చన, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, ఏసీపీ కృష్ణయ్య, సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి, సెక్టార్ ఎస్ఐ లక్ష్మణ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇష్టారాజ్యంగా RMP ల వైద్యం..
రంగారెడ్డి జిల్లాలో ఆర్ ఎం పి వైద్యులు రాజ్యమేలుతున్నారు. జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీ డాక్టర్లు కాసుల కక్కుర్తితో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ అందిన కాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సరైన వసతులు, అర్హతలేని డాక్టర్లతో వైద్యం నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లకు గతంలో నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు. కానీ రాజకీయ పలుకుబడి, ఇతరత్రా ఒత్తిళ్లతో కొన్నిరోజులకే ఆ క్లినిక్‌లన్నీ మళ్లీ తెరచుకున్నాయి. కాగా ఇటీవల ఓ క్లినిక్‌లో కాలం చెల్లిన పరికరాలతో, వాటికి ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి, నోటీసులతో సరిపెడుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు పకడ్బందీగా నిర్వహించి, నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లను మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.