TELANGANA NEWS UPDATE 2025 :రీజనల్ రింగ్ రొడ్ కోసం నిధుల కసరత్తు
Construction of the Regional Ring Road will be a landmark for Telangana
రీజనల్ రింగ్ రొడ్ కోసం నిధుల కసరత్తు
హైదరాబాద్-ప్రభాత సూర్యుడు
తెలంగాణకే తలమానికంగా నిలవనున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఉత్తరభాగం పనులకు సై అన్న కేంద్రం.... దక్షిణభాగంపై నోరుమెదపడం లేదు. రెండు వైపులు ఒకేసారి చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజ్ఞప్తి చేసినా.... కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం సొంతంగా నిర్మించనుందా అనే చర్చ మొదలైంది. నిధుల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రాంతీయ వలయరహదారి దక్షిణభాగం నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. డీపీఆర్ తయారీకి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. మొదటిసారి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో రెండోసారి మళ్లీ టెండర్లు పిలవగా...మార్చి 9 వరకు గడవు ఉంది. దక్షిణభాగం పనులకు సుమారు రూ.14 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నిధులు సేకరణ, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు సైతం పిలిచింది. అలాగే వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌కు సలహాలు, సూచనలు ఇవ్వడానికి సైతం టెండర్లు ఆహ్వానించింది. ప్రాంతీయ వలయ రహదారి ఉత్తరభాగం నిర్మాణంపై ఆసక్తి చూపుతున్న కేంద్రం దక్షిణభాగంపై మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కేంద్రం చేతులెత్తేస్తే...రాష్ట్ర ప్రభుత్వమే ఈ పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను సైతం రేవంత్‌రెడ్డి సర్కార్ ఆలోచిస్తోంది.
నిధులు సవిూకరణం ఎలా చేయాలన్నదానిపై దృష్టిసారించింది. ఇప్పిటికే పలుమార్లు దక్షిణభాగం పనులు తామే చేపడతామని సైతం ప్రకటించింది. నిధుల సవిూకరణ కోసం ప్రపంచ బ్యాంకు, జైకా, ఏడీబీ సాయం తీసుకోవాలని యోచిస్తుంది. దక్షిణభాగం పనులు చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూనే... ప్రత్యామ్నయంగా రాష్ట్రప్రభుత్వం సైతం తన పని తాను చేసుకుంటూపోతోంది. డీపీఆర్, పీఎంయూ, నిధుల సేకరణ వంటి వాటికి టెండర్లు పిలిచి...బిడ్ దక్కించుకునే కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చే నివేదికనే కేంద్రానికి ఇచ్చి దాని ఆధారంగా ఈ పనులు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఉన్నాతాధికారులు తెలిపారు...తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరభాగం పనులకు ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ టెండర్లు ఆహ్వానించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 17న బిడ్‌లు తెరవనున్నారు. ఐదు ప్యాకేజీల్లో చేపట్టనున్న ఈ పనులు సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు మొత్తం 161.518 కిలోవిూటర్ల మేర సాగనున్నాయి. ఉత్తర భాగం పనులకే రూ.7,104.06 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలి. అయితే ఉత్తరభాగం పనులతోపాటు దక్షిణభాగం పనులు సైతం సమాంతరంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 189.20 కిలోవిూటర్ల మేర చేపట్టనున్న ఈ పనులకు రూ.14వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది.ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. భూముల ధరలు పెరగడంతోపాటు స్థిరాస్థి వ్యాపారం వృద్ధి చెందనుంది. అలాగే తెలంగాణలోని ప్రతి నగరం, పట్టణానికి జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడనుంది. ముఖ్యంగా కేపిటెల్ సిటీ హైదరాబాద్‌కు వచ్చే మార్గం సుగమం కానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఓఆర్‌ఆర్...హైదరాబాద్‌కు మణిహారంగా మారింది. దేశంలోని ఏ రాజధానికి లేని విధంగా...రాజధాని చుట్టూ 150 కిలోవిూటర్లకు పైగా నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వేతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతోపాటు...సవిూపప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయి. ఇప్పుడు కొత్తగా నిర్మించనున్న ఆర్‌ఆర్‌ఆర్‌తో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈరెండు వలయ రహదారుల మధ్య ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక అభివృద్ధి ప్రాంతంగా భావిస్తోంది.