TPCC : కాంగ్రెస్‌లో కీచురాళ్ల రోద
పదవుల కోసం పార్టీనే భ్రష్టు పట్టించే నేతలు, గట్టిగానే వార్నింగ్ ఇచ్చేలా విూనాక్షి నటరాజన్ చర్యలు

కాంగ్రెస్‌లో కీచురాళ్ల రోద
- పదవుల కోసం పార్టీనే భ్రష్టు పట్టించే నేతలు
- గట్టిగానే వార్నింగ్ ఇచ్చేలా విూనాక్షి నటరాజన్ చర్యలు
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణ కాంగ్రెస్‌లో సన్వయం లోపించిందా ..అంటే ఔననే సమాధానం వస్తోంది. విమర్శలను గట్టిగా తిప్పికొడ్డంలో విఫలం అవుతున్నారు. అలాగే విూనాక్షి నటరాజన్ వచ్చాక వేగంగా పరిణామాలు మారు తున్నాయి. వీటిని ఆధారం చేసుకుని సిఎం రేవంత్ రెడ్డిని మార్చడం ఖాయమని బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఇవన్నీ ఎలా ఉన్నా కాంగ్రెస్‌లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉన్నారు. అయితే విూనాక్ష నటరాజన్ కొంత కటువుగానే ఉంటానని సంకేతాలు ఇచ్చారు. తీన్మార్ మల్లనన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయడం,కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశంపైనా ఆమె గట్టిగానే మందలించారు. ఈ క్రమంలో ఆమె కటువువగా ఉంటే కనీసం పార్టీలో కట్టుబాట్లు అయినా కఠినంగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరికి వారు తామే గొప్పఅనుకుంటారు. వాడి పీకుడెంత అన్న ధోరణిలో ఉంటారు. ఇలాంటి సందర్భంలో విూనాక్షి రావడంతో కొంత పార్టీలో ఆందోళన, అలజడి మొదలయ్యిందనే చెప్పాలి.
గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీ కట్టుబాట్లకు ఆ పార్టీ సీనియర్ నాయకులే తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. అధికారం దక్కడంతో తమకు తిరుగు లేదని భావిస్తున్నారు. నిజానికి కెసిఆర్ కుటుంబ పాలన, అహంకారం, బిజెపి నుంచి బండి సంజయ్‌ను మార్చడం ఇత్యాదికారణాల వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అంతేకానీ కాంగ్రెస్‌పై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదు. దీనిని విస్మరించిన నేతలు ఇక తమకు తిరుగులేదన్నరీతిలో వ్యాఖ్యలుచేస్తున్నారు. గ్రామస్థాయి లో సమస్యలను విస్మరిస్తున్నారు. అందుకే ఇటీవల హద్దువిూరుతున్న ఈ నాయకుల తీరు పట్ల అధిష్ఠానాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీరి వైఖరి వల్ల కాంగ్రెస్ పార్టీ ఎª`పుడూ ఇంతేనని ప్రజల్లో బలంగా నాటుకున్న అభిప్రాయం మరింత బలపడిరది. అందుకే పార్టీ గీత దాటుతున్న వారిని కట్టడి చేయడంలో భాగంగానే రాష్ట్ర పార్టీ ఇంచార్జీగా విూనాక్షి నటరాజన్‌ను నియమించినట్టు చెబుతున్నారు. తన తొలి సమావేశంలోనే పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని విూనాక్షి నటరాజన్ హెచ్చరించడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. పార్టీ నేతలను కట్టడి చేయడంలో పూర్వ ఇంచార్జీ దీపాదాసు మున్షీ విఫలం అయిందని అధిష్ఠానం భావించడం వల్లనే కొత్త ఇంచార్జీని నియమించినట్టు పార్టీ వర్గాల సమాచారం. అలాగా విూనాక్షి కూడా కటౌట్లకు, పొగడ్తలకు, సన్మానాలకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే అధికారంలోకి రావడంతో కొందను పదవుల కోసం పట్టుబడుతున్నారు.మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఆశించే కొందరు సీనియర్లు పార్టీ పెద్దలను బ్లాక్‌మెయిల్ చేయడానికి వెనుకాడటం లేదన్న వాదనా ఉంది. వీటికి తోడుగా తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా తోడైందని చెబుతున్నారు.
పార్టీలో పదవులను పొందాలనుకునే నాయకులు నయానో భయానో పార్టీ పెద్దలను బెదిరించడానికి కుల రాజకీయాలకు తెర లేపారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రివర్గం లో ఎలాగైనా స్థానం సంపాదించే వ్యూహంతో మొదట పార్టీ వైఖరితో సంబంధం లేకుండా సీనియర్ నాయకుడు వివేక్ వెంకటస్వామి పెద్ద ఎత్తునా మాలల సభ నిర్వహించారు. నిజానికి ఆయనింటినుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి ఉన్నా..ఇంకా అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ప్రశ్నించే విధంగా వివేక్ వెంకటస్వామి తన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా సభలుపెట్టి సవాల్ విసిరారు.
మంత్రివర్గ విస్తరణలో స్థానం సంపాదించడానికే ఆయన కొంత బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అధిష్ఠానానికి అందాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢల్లీికి వెళ్లి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోక తప్పలేదని అంటున్నారు. అలాగే ఇటీవల మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ కూడా తన సామాజికవర్గం నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ ముఖ్యులపై తీవ్ర ఆరోపణలు చేసారు. సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్‌కు కాకుండా తనకు టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడనని అంజన్‌కుమార్ యాదవ్ వ్యాఖ్యనించారు. ఎంపి టికెట్ నిర్ణయం అనేది అధిష్ఠానం తీసుకున్న నిర్ణయమే తప్ప అది రాష్ట్ర నాయకుల నిర్ణయమన్న విషయం కాదన్నది అంజన్‌కుమార్ యాదవ్ వంటి సీనియర్ నాయకుడికి తెలియదనుకోవడానికి లేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీని దక్కించుకోవడానికే తన సామాజికవర్గం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పెద్దలను పరోక్షంగా దారికి తెచ్చుకునే వ్యూహంతోనే అంజన్‌కుమార్ యాదవ్ ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన తనయుడు రాజ్యసభ ఎంపిగా ఉన్నారు. అయినా తనకు కూడాపదవి కావాలన్నది ఆయన కోరిక.అంజన్‌కుమార్ యాదవ్ బాటలోనే మరో సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తన సామాజిక వర్గం నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పదవులలో తమ సామాజికవర్గం నేతలకు అన్యాయం జరిగిందనే వాదన గట్టిగా వినిపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి కోసమే విహెచ్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు అధిష్టానం పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది.
సొంత పార్టీ నేతలతో కాకుండా ప్రతిపక్ష పార్టీలలో ఉన్న తమ సామాజిక వర్గం నేతలను కూడా ఈ సమావేశానికి విహెచ్ ఆహ్వానించడమే కాకుండా మున్నూరు కాపులకు కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరుగుతుందనే విమర్శలు చేయించడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కోరేలా ఉంది.ఇవన్నీకూడా విూనాక్షి నటరాజన్ అధ్యయనం చేస్తున్నారు. ఇకపోతే మరో సీనియర్ నాయకుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనకు కేబినేట్ బెర్త్ కల్పించాలి. పరోక్షంగా అధిష్టానానికి హెచ్చరికలు చేశారు. మల్‌రెడ్డి వర్గీయులు ఓ అడుగు ముందుకేసి కాబోయే మంత్రి మల్‌రెడ్డి రంగారెడ్డి అనే ప్లెక్షీలు ఏర్పాటు చేసిన విషయం అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. మూసీనది ప్రక్షాళనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా ఏర్పాటు చేయగా, దానిని ప్రతిపక్ష నాయకుల కంటే ముందుగానే ’హైడ్రా..గిడ్రా జాన్తా నహీ’ అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పు పట్టారు.
తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు పలుమార్లు చెబుతున్నా ఆయన నుంచి పార్టీ వివరణ కోరలేక పోయింది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మందునుంచీ మంత్రిపదవి కావాలని కోరుకుంటు న్నారు. తనకు హోంమంత్రిపదవి ఇస్తే కెసిఆర్‌ను బొక్కలో వేస్తానని ప్రకటించారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి కూడా వివాదంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీలో కొందరు నాయకులకు డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని చిన్నారెడ్డి స్వయంగా ఆరోపించారు. పైగా మహబూబ్‌నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి రూ. 90 కోట్లు తీసుకొని పార్టీని మోసం చేసారని కూడా చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పదవిలో ఉన్న నాయకుడే ఈ విధంగా క్రమశిక్షణ తప్పి మాట్లాడటం ఎంత వరకు సమంజసమని పార్టీలో చర్చగా మారింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీ సీనియర్ నాయకులే ప్రభుత్వానికి, పార్టీకి తలనొప్పిగా మారడాన్ని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుందని పార్టీ వవర్గాల సమాచారం. వీరందరిని దారిలో పెట్టేందుకే విూనాక్షికి పూర్తి అధికారాలు ఇచ్చారని అంటున్నారు.