Rising Telangana - Prajapalana : గ్రామాలకు వెళ్లాలంటే భయపడుతున్నపంచాయతీ కార్యదర్శులు
మూకమ్మడి సెలవులు పెడతాం, ఒత్తిళ్లు భరించలేం
![Rising Telangana - Prajapalana : గ్రామాలకు వెళ్లాలంటే భయపడుతున్నపంచాయతీ కార్యదర్శులు](https://www.prabhathasuryudu.com/media-webp/2025-01/worst-situation-of-gram-panchayat-secretaries-in-telangana_iynkb6b4jm.jpg)
మూకమ్మడి సెలవులు పెడతాం
ఒత్తిళ్లు భరించలేమంటున్న గ్రామ కార్యదర్శులు
వరంగల్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 4 కీలక పథకాలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తోంది. అర్హులను గుర్తించే పనిలో పడిరది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో అధికారులు ప్రకటిస్తున్నారు.అయితే.. ఈ కీలక ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ముఖ్యం. కానీ వారు ప్రస్తుతం గ్రామాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రజలు దాడులు చేస్తారని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పని ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు. ప్రస్తుతం ప్రతీ మండలంలో ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఇన్‌ఛార్జిలను నియమించి పనులు చేస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. నగరాలు పట్టణాలతో పోలిస్తే.. గ్రామాల్లో పరిస్థితి వేరేలా ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన పథకాలు వారికి రాకపోతే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికార పార్టికి చెందిన స్థానిక నాయకులు ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లలేక.. గ్రామాలకు వచ్చే పంచాయతీ కార్యదర్శులను నిలదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవారిలో చాలామంది కొత్తవారు కావడంతో.. పరిస్థితులను ఎదుర్కోలేక భయపడుతున్నారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అయితే జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో గ్రామస్థులు అధికారులను నిలదీస్తున్నారు. దీంతో పలుచోట్ల గ్రామసభలు రసాభాసగా మారాయి. అధికారులు, పోలీసులు కల్పించుకుని గ్రామస్థులకు సర్థిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పలుచోట్ల గ్రామసభలను గ్రామస్థులు బహిష్కరిస్తున్నారు. జాబితాల్లో పేర్లు ఉన్న వారు ఆనందం వ్యక్తం చేస్తుంటే...పేర్లు రాని వాళ్లు అధికారులపై ఫైర్ అవుతున్నారు. అర్హులను పక్కన పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్హులందరికీ పథకాలు వస్తాయని, పేర్లు రానివాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారుగ్రామసభల్లో ఉద్రిక్తతలపై బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అంటూ విమర్శించారు. సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందన్నారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే కాంగ్రెస్ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతుందన్నారు.’’ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణం. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా.? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా? ఎన్నికల ముందు హావిూలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడతాం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి’’ ` మాజీ మంత్రి హరీశ్ రావు’’విూరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా.. ఏడాది కాలంలో విూరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారు. విూరు చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తారు. అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై విూ పాలనను నిలదీస్తుంది. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతారు. ఎంత మందిని అరెస్టులు చేస్తారు.విూ పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండి. ప్రతిపక్షాల విూద బురదజల్లడం మాని పరిపాలన విూద దృష్టి సారించండి. ఎన్నికల హావిూలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’`మాజీ మంత్రి హరీశ్ రావు
మరోవైపు పథకాలు అందని వారినుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగం చేయడం కంటే.. మానేయడం ఉత్తమం అనే అభిప్రాయాలను పంచాయతీ కార్యదర్శులు వ్యక్తం చేస్తున్నారు.గ్రామసభల నేపథ్యంలో ‘గ్రామ, వార్డు సభలు ప్రారంభం కాగానే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పరస్పరం తిట్టుకున్నారు. పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. మరికొన్నిచోట్ల అధికారులను ప్రజలు నిలదీశారు. తమపేర్లు జాబితాలో ఎందుకు లేవని గట్టిగా ప్రశ్నించారు. దీంతో గ్రామసభలకు వచ్చిన అధికారులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ‘మేం చేసే పని చేస్తున్నాం. అందరి పేర్లు ఎందుకు రాలేదంటే మాకెలా తెలుస్తుంది. గ్రామాల్లో ప్రజల మెప్పుకోసం రాజకీయ పార్టీల నాయకులు మమ్మల్ని తిడుతున్నారు. మరికొందరు తమపై దాడిచేయాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. మా గ్రామం కాకుండా ఇంకో గ్రామం బాధ్యతలు నాకే అప్పగించారు. పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. పైగా బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కంటే ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటడం మేలు అనిపిస్తుంది’ అని మహిళా పంచాయతీ కార్యదర్శి వాపోయారు.