TG Assembly Special Meeting : ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
Telangana Assembly special session on February 7th 2025
ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
2025, ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్టును రెడీ చేశారు. ఈ తుది నివేదికను 2025, ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. కుల గణన సర్వే రిపోర్టుపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి తుది నివేదికను ఆమోదం కోసం కేబినెట్‌కు పంపనుంది. 2025, ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయ్యి.. కుల గణన సర్వే రిపోర్టుపై చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం 2025, ఫిబ్రవరి 7వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కుల గణన నివేదికపై సభలో చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యి.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహణపై ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రత్యేక సెషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే.. ఫిబ్రవరి 5న జరగనున్న కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. ఈ భేటీలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.