Cold wave alert Telangana districts : తెలంగాణలో చలిపులి పంజా
మళ్లీ పెరుగుతన్న చలి..సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు
మళ్లీ పెరుగుతన్న చలి...
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. గత వారం క్రితం వరకు సాధారణంగానే ఉన్న ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి తగ్గిపోయాయి. రెండ్రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 దాటినా చలి తీవ్రత తగ్గటం లేదు. దానికి తోడు పొగమంచు కూడా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో స్వెట్టర్లు, మఫ్లర్లు లేకుండా కాలు బయటపెట్టం లేదు.కాగా, నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చల్లటి ఈదురుగాలులు వీస్తాయన్నారు. 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఈ నాలుగు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. ఇక హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నిజామాబాద్, జనగామ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక రాత్రి తెలంగాణలోనే అతి తక్కువగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సిర్పూర్‌లో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7 , రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. మరో ఏడు జిల్లాల్లోని చాలా మండలాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదనట్లు తెలిపారు.తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని.. చలి ఎక్కువగా సమయంలో ఇళ్లకే పరిమితం కావాలని, వెచ్చని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇక పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.